BRS News: హైదరాబాద్: బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ తరం కాదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ బీజేపీకి ప్రత్నామ్నాయం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదని, కనుక ఏఐసీసీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. నిజానికి బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ అధినేతలు, పలు రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రము ప్రత్యామ్నాయము కాదన్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బిజెపితో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందని సెటైర్లు వేశారు దీంతో బీజేపీకి లాభం చేకూరుతుంది, ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఇండియా’ కూటమికి దూరమవుతున్న ప్రాంతీయ పార్టీలు
కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్తున్నాయి. ఓవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై కాంగ్రెస్ తీరు నచ్చక.. తమ దారి తాము చూసుకుంటున్నామని తేల్చేశారు. రాష్ట్రంలో బలమైన టీఎంసీకి తక్కువ సీట్లిచ్చి, ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించడంతో మొదటికే మోసం వచ్చింది. మరోవైపు పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ సైతం కూటమి నుంచి కాకుండా ఒంటరిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ విధానాలు, సీట్ల పంపకాలపై వారి తీరుతో కేజ్రీవాల్ విసుగు చెందారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
బిహార్ విషయానికొస్తే నితీష్ ఎప్పుడు ఏ పార్టీకి మద్దతు తెలిపి కూటమి ఏర్పాటు చేస్తారో రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించడం కష్టమే. కాంగ్రెస్ తో ఏర్పాటు చేసిన కూటమినుంచి బయటకు వచ్చి బీజేపీకి మద్దతు తెలిపి ఏకంగా 9వ సారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ఇటీవల ప్రమాణ్వీకారం చేశారు. దక్షిణాదిన తెలంగాణలో కాంగ్రెస్ కాస్త పరవాలేదనిపిస్తోంది. ఏపీలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. తమిళనాడులో డీఎంకే పార్టీతో సన్నిహితంగా కనిపిస్తున్నా.. సైద్ధాంతిక విభేదాలు బహిర్గతం అవుతూనే ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎలా ఉంటుందనే అంశంపై అక్కడ సైతం ఉత్కంఠ నెలకొంది.