Telugu News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే బ్యారేజీని రిపేర్ చేయిందని వివరించారు. ఇన్నాళ్లూ ఆ బ్యారేజీ ఎందుకు పనికి రాదని కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బ్యారేజీని పూర్తి చేసిందని అన్నారు. వరద ఎదుర్కొనేందుకు కూడా బ్యారేజీ రెడీగా ఉందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు లెంపలేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఇన్నాళ్లు చేసినది చిల్లర రాజకీయమని కొట్టిపారేశారు.
నిన్నటి దాకా.. మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు.. అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు. లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు. అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతది అన్నారు. నేడు మాత్రం.. మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారు.. అంటే.. ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది. 8 నెలల నుంచి చేసింది.. కాలయాపనే అని రుజువైపోయింది. రిపేర్ల మాటున జరిగింది.. చిల్లర రాజకీయమని వెల్లడైపోయింది.
ఇకనైనా.. కేసిఆర్ గారి జల సంకల్పాన్ని.. హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై.. విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి. కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలి’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన పగుళ్ల అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఓ దశలో అదే గెలుపొటములను నిర్దేశించే అంశంగా మారింది. అప్పట్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను చూపిస్తూ.. ఇక ఆ బ్యారేజీ వేస్ట్ అని ప్రచారం చేసింది. దాని రిపేర్ చేయలేమని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.