BRS Lok Sabha Review from January 3 :  అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు,  మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఈ రివ్యూలు జరగనున్నాయి. కేసీఆర్‌కు తుంటి ఆపరేషన్ జరగడంతో ఇంకా కోలుకోలేదు. అందుకే కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. 


రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ కారణంగా మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.జనవరి 3న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సన్నాక సమావేశాలు షురూ అవుతాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయి. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్ , 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. 


సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా కీలక నేతలు సమావేశాలకు హాజరవనున్నారు.


తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందని..  మంచి విజయం సాధిస్తే..  బలంగా పోరాడవచ్చని  భావిస్తున్నారు.