BRS Telangana Formation Day Celebrations for 3 days | హైదరాబాద్: జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానుంది. తెలంగాణ ఏర్పడి దశాబ్దం కావొస్తున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో 3 రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరగనుంది. ఈ మేరకు కార్యక్రమాల షెడ్యూల్ సైతం సోమవారం నాడు (మే 27న) విడుదల చేశారు.



జూన్ 1 : తొలిరోజు
గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద అమర జ్యోతి వరకు జూన్ ఒకటవ తేదీన సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి, ఘన నివాళి అర్పించనున్నారు.


జూన్ 2 : రెండో రోజు
ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావమై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకల సభ నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సభ జరుగనున్నది. హైదరాబాద్ నగరంలో పలు హాస్పిటల్స్, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు.


జూన్ 3: మూడో రోజు
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథ శరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.


6 దశాబ్దాల కల సాకారం చేసిన కేసీఆర్!
ఉద్యమ నేతగా తన ప్రాణాలు ఎదురొడ్డి, ఆమరణ దీక్ష సైతం చేసి 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారు కేసీఆర్. 
తెలంగాణ సాధించి, తొట్ట తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాలన అందించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు  గులాబీ బాస్ కేసీఆర్ పిలుపునిచ్చారు.


గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా brs కార్యకర్తలు, పార్టీ సూచనలను  అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయాలని అధినేత కేసీఆర్ కోరారు.