BRS Released Telangana Assets List: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది... ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటోంది బీఆర్‌ఎస్. కేసీఆర్ హయాలో అప్పులు కాదు... ఆర్థిక ప్రగతి సాధించామని నొక్కి చెప్తోంది బీఆర్‌ఎస్. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆస్తుల వివరాలతో బీఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే ప్రస్తావిస్తోంది. ధనిక రాష్ట్రాన్ని... అప్పుల రాష్ట్రంగా మార్చారని కొత్త మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడా కనిపించడలేదని సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్కతోపాటు పలువురు మంత్రులు ఆరోపించారు. అంతేకాదు... ఆర్థిక శాఖపై సభలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కూడా... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన సంపదకు సంబంధించిన జాబితా విడుదల చేసింది.
మరోవైపు.... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తిచేసినట్టు తెలుస్తోంది. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దాదాపు 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ బృందంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత, రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, నిధుల సమీకరణ, కేటాయింపులు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల లెక్కలను ప్రత్యేకంగా తెప్పించుకున్నట్టు సమాచారం. దీంతోపాటు శాఖల వారీగా పూర్తిస్థాయి వివరాలు సేకరించి నివేదికలు సిద్ధం చేశారు. ఈ నివేదికను మంత్రులను అందించినట్టు తెలుస్తోంది.
ఈ నివేదికల్లో... ఏ సంవత్సరం... ఏ పథకానికి నిధులు ఇచ్చారు అన్న వివరాలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఏయే పథకాలకు ఎంత మేరకు నిధులు మంజూరు చేశారు... వాటిలో ఎంత మేరకు వినియోగించారు? అన్న వివరాలు కూడా సేకరించారు. ఆ నిధులు ఏమైనా పక్కదారి పట్టాయా...? వేరే పనులకు నిధులు మళ్లించారా? వంటి అంశాలను కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా.... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా సరే ఇరుకున పెట్టాలనే పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రత్యేక నివేదికలు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తోంది. దీంతో... ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ఇవాళ (బుధవారం) అసెంబ్లీలో విడుదల చేయనుంది. దీనికి ముందే.. బీఆర్‌ఎస్ ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. ఈక్రమంలో ఇవాళ (బుధవారం) అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి.