Kavitha Suspension Soon:  ఇబ్బందుల్లో ఉన్నపార్టీని మరిన్ని ఇబ్బందులు పెడుతున్న కవితను పార్టీ నుంచి సాగనంపాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి నష్టం చేసేలా ఆమె వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత ? అని ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ కూడా ఆగ్రహంతో ఉంది.  తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడుతా. మొదటిసారి పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేస్తున్నవారి పేర్లు బయటపెడుతున్నానని.. హరీష్ , సంతోష్ రావు పేర్లు చెప్పారు. పార్టీ అగ్రనాయకుల మధ్య విబేధాలు సృష్టించడానికే ఇలా చేశారని ముఖ్యనేతలు నమ్ముతున్నారు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 

లేఖ లీక్ తో ప్రారంభమైన వివాదం 

కవిత మేలో తన తండ్రి ,  పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ వివాదాస్పదమైంది. అది లీక్ కావడంతో పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఆ లేఖలో కవిత, పార్టీ అధ్యక్షుడి పనితీరు, సంస్థాగత లోపాలు,  బీజేపీతో సంబంధాలపై పలు అంశాలను విమర్శించారు.  ఈ లేఖ లీక్ కావడంతో  కవిత సోదరుడు కేటీఆర్ ,  ఇతర నాయకులపై పరోక్షంగా విమర్శలు చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారు. అప్పట్నుంచి కవితను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదు. కవిత తన జాగృతిని బలోపేతం చేసుకుంటూ జాగృతి తరపునే కార్యక్రమాలు చేపడుతున్నారు. 

కవిత బీఆర్ఎస్ అగ్రనేతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అనుమానం 

అప్పట్లో లేఖతో పాటు తాజాగా ప్రెస్మీట్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్యలు వస్తాయని పార్టీ నాయకత్వం  అనుమానిస్తోంది.  బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే బలహీనంగా ఉంది, ఇలాంటి అంతర్గత విభేదాలు పార్టీని మరింత దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కవితపై తీన్మార్ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేసనప్పుడు కూడా పార్టీ నేతుల ఎవరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు కవిత అలా విమర్శలు చేయగానే ఇలా హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. 

పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మరింత నష్టమని అంచనాలు

కవిత ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యల్లో  కేటీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ హరీష్ ,సంతోష్ లను టార్గెట్ చేశారు.  అసలే కాళేశ్వరం రిపోర్టు ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత చేస్తున్న రాజకీయం పెను సమస్యగా మారుతోంది. పార్టీలో ముఖ్య నేతల మధ్య ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగేలా కవిత ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నారు. కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు రావడం, సీబీఐ ఎంక్వైయిరీ జరుగుతుందని  ప్రచారంజరుగుతూండటాన్ని కవిత వ్యూహాత్మకంగా తన రాజకీయానికి ఉపయోగించుకున్నారని బీఆర్ఎస్ అగ్రనేతలు అనుమానిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మరింత నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

కవిత రాజకీయంతో కేసీఆర్ కూడా కలత చెందారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవితతో ఆయన మాట్లాడటం లేదని అంటున్నారు. ఇప్పుడు ఇక అటో ఇటో తేల్చాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారని అంటున్నారు.