Tula Uma in BRS: బీజేపీ అగ్రవర్ణాల పార్టీ, కార్యకర్తల్ని వాడుకుంటుంది - తుల ఉమ, బీఆర్ఎస్‌లో చేరిక

తుల ఉమ బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్లు తనకు ఇచ్చినట్లే ఇచ్చి దొంగదారిన మరొకరికి ఇచ్చారని ఆరోపించారు. వారు చెప్పిన మాటపై నిలబడబోరని అన్నారు.

Continues below advertisement

Tula Uma Joins in BRS Party: బీజేపీలో నేతలు ఎవరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండబోరని వేములవాడ బీజేపీ మాజీ నాయకురాలు తుల ఉమ ఆరోపించారు. ఆమె నేడు (నవంబరు 13) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ తుల ఉమకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుల ఉమ బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్లు తనకు ఇచ్చినట్లే ఇచ్చి దొంగదారిన మరొకరికి ఇచ్చారని ఆరోపించారు. వారు చెప్పిన మాటపై నిలబడబోరని అన్నారు.

Continues below advertisement

బీజేపీలో తాజాగా హామీ ఇచ్చిన విధంగా ఓ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం అనేది ఓ కల మాత్రమే అని అన్నారు. అందుకు ఉదాహరణ తానే అని అన్నారు. తనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటని ఆక్షేపించారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అని, అది కేవలం కింది స్థాయి కార్యకర్తలను మాత్రమే వాడుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ తాను గతంలో బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నానని.. అనేక హోదాల్లో పని చేసినప్పటికి ఇక్కడ ఇచ్చిన గౌరవం బీజేపీలో ఇవ్వలేదని అన్నారు. అందుకని బీజేపీ కార్యకర్తలు ఆగం కావొద్దని  సూచించారు. వారు కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవలనుకుంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని దయచేసి బీజేపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

ఇప్పుడు తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని తుల ఉమ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మధ్యలో కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ తిరిగి నా సొంత గూడు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అదే ఉత్సాహంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తాం’’ అని అన్నారు.

బీజేపీకి రాజీనామా లేఖ

వేములవాడ బీజేపీ టికెట్ ఇచ్చి.. ఆఖరి నిమిషంలో బీఫామ్ ఇవ్వకపోవడంతో తుల ఉమ ఆ పార్టీకి సోమవారం ఉదయం (నవంబరు 13) రాజీనామా చేశారు. వేములవాడ టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈ లేఖ రాశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. బీసీ బిడ్డనైన తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు.

లేఖలో ఏముందంటే.?

'బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. పార్టీకి చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో బీఫామ్‌ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు. నా గొల్ల కురుమ జాతికి జరిగిన అన్యాయం. యావత్‌ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నారు. నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేస్తున్నారు. అసలు బీఫామ్‌లే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకు పోతామని అనడం విడ్డూరంగా ఉంది.' అని తుల ఉమ లేఖలో పేర్కొన్నారు.

Continues below advertisement