తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరికొందరు బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి గురుద్వార్ ప్రబంధక కమిటీ స్వాగతం పలికింది అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
నాందేడ్ సభ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బహిరంగ సభ పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాల మల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు మంత్రి ఇంద్రకరణ్. బీఆర్ఎస్ సభాస్థలితో పాటు పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, ఇతర పనుల ప్రగతిని పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
నాందేడ్ లో బీఆర్ఎస్ సభ వేదికను పరిశీలించిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఫిబ్రవరి 5న నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలోనూ తెలంగాణ మోడల్ పాలనకు ఆసక్తి..
మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ మోడల్ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. జాతీయ స్థాయిలో రానున్నరోజుల్లో జరగబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుందని తెలిపారు. భావసారూప్యత కలిగిన వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు... బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు. రెండో రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన 2023 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరినీ అనుమతించలేదు. బడ్జెట్ సమర్పించడానికి పది రోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్ మెంట్ లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. దీన్ని ఆర్థిక మంత్రి సమక్షంలో సిబ్బందికి పంచుతారు.