BRS News :  అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల్ని ఎవ్వరికీ ఇవ్వొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు.   చాలా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ,  రిజిస్టర్ అయిన పార్టీల అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ మేకర్, ట్రక్కు, ఆటో, ట్రాక్టర్ లాంటి గుర్తుల్ని కేటాయిస్తున్నారు.  ఇవన్నీ కారుని పోలి ఉండటం వల్ల  తమ పార్టీకి పడే ఓట్లు డైవర్ట్ అవుతున్నాయని బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలోని ఈసీ అధికారులకు బుధవారం సమర్పించిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గతంలోనూ ఈసీ దృష్టికి తీసుకొచ్చామని అయినా  కేటాయించారని ఈ సారి మత్రం కే్టాయించవద్దని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. 


2020 నవంబర్ లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక  లో బీఆర్ఎస్ అభ్యర్థి 1,079 ఓట్లతో ఓడిపోయింది. కానీ  రోటీ మేకర్ గుర్తుతో పోటీచేసిన బండారు నాగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి  3,510 ఓట్లు పోల్ అయ్యాయి. రోటీ మేకర్ కారు గుర్తును పోలినట్లుగా ఉండటంతో అవన్నీ బీఆర్ఎస్ ఓట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తన్నారు.  హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక  లో రోటీమేకర్ గుర్తుతో పోటీచేసిన సుమన్‌కు 2,697 ఓట్లు వచ్చాయి.  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన యుగతులసి అభ్యర్థి శివకుమార్‌కు 1,880 ఓట్లు పడ్డాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌లో రోడ్డు రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు, సిర్పూర్‌లో 4,039, మునుగోడులో 3,569, డోర్నకల్‌లో 4,117, హుజూరాబాద్‌లో 2,660, భూపాలపల్లిలో చపాతీ మేకర్ గుర్తుతో పోటీచేసిన మంతెన సంపత్‌కు 4,787 ఓట్లు, దేవరకొండలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన రమావత్ నాయక్ 3,247 ఓట్లు, గజ్వేల్‌లో ఇదే గుర్తుతో పోటీచేసిన కంటె సాయన్న  3,353 ఓట్లు చొప్పున ఓట్లు పడ్డాయి.


ఇవన్నీ కారు గుర్తుకు పడాల్సిన ఓట్లేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  రోడ్డు రోలర్ మాత్రమే కాక రోటీ మేకర్ గుర్తు కూడా బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా పరిణమించినట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. 2020 నవంబరులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆ ఏడాది జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రోడ్డు రోలర్, రోటీ మేకర్, కెమెరా, డోలీ, టీవీ, సోప్ డిష్, కుట్టుమిషన్ తదితరాలను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ రిక్వెస్టు చేసింది. 


దృష్టి దోషం ఉన్న ఓటర్లలో ఈ గుర్తు గందరగోళం సృష్టిస్తున్నదని, కారుకు పడాల్సిన ఓట్లు వీటి వెళ్ళిపోతున్నాయని వివరించింది.   ఇంతకాలం కొన్ని స్థానాలకే ఈ తలనొప్పి ఉంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకూ ముప్పుగా పరిణమిస్తుందన్నది ఆ పార్టీ ఆవేదన. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కీలకం కానుండడంతో  ఇతర పార్టీలకు చెందిన వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి.. ఉద్దేశపూర్వకంగా రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులను కోరుకుంటారని.. అదే జరిగితే ఓట్లు చీలుతాయని అనుకుంటున్నారు. ఈసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.