బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన ఖరారైంది. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో "2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు ?" అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొంటారు. 


ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచి శివ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతారు. అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.


బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవిత చాటిచెప్పనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు.  సోమవారం నాడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాజికంగా జరిగే లాభాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై చూపించే సానుకూల ప్రభావం గురించి వివరించనున్నారు.


ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే, అంతా బాగేనే ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై అదానీ కంపెనీలపై దర్యాప్తు చేపట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవిత సోమవారం శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు.


అదానీ షేర్లతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్ల పతనం.. 
దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ సంస్థల షేర్ల విలువ దారుణంగా పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దారుణం అన్నారు. అదానీ కంపెనీలతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి దిగ్గజ సంస్థల షేర్ల విలువ ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి భారీగా పడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. రూ. 3600గా ఉన్న అదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ.1400కు పడిపోయిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. 


దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగుందని కేంద్ర మంత్రి సీతారామన్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అదానీ షేర్ల పతనం, ప్రముఖ కంపెనీల షేర్ల విలువ పతనం కావడంపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ మద్దతుతోనే అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచానికి తెలుసునని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికీ తెలుసన్నారు