దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ గేమ్ చేంజర్ కాబోతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ వంద జన్మలెత్తినా చేయలేదని, కేసీఆర్ బిడ్డగా తాను గర్వ పడుతున్నట్లు చెప్పారు. చెన్నైలో గురువారం ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు?’ అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న కవిత తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవవహరించిన ఈ చర్చా గోష్ఠిలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై కూడా పాల్గొన్నారు.
ప్రాంతీయ పార్టీల పని తీరు భేష్
దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయని, బీజేపీ, కాంగ్రెస్ కంటే చాలా ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని కవిత తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పెరిగిన వృద్ధి శాతమే అందుకు నిదర్శనమని అన్నారు. జాతీయ స్థాయిలో 75 ఏళ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమీ చేయలేదని విమర్శించారు.
దేశమంతా విస్తరిస్తాం
తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తాము దేశమంతా విస్తరిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనం తప్పదని అన్నారు. 2024 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
73 లక్షల ఎకరాలకు సాగు నీరు
తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులను బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో మూడున్నరేళ్లలో పూర్తి చేశామని, 73 లక్షల ఎకరాలకు ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోందని కవిత చెప్పారు.
'కుటుంబ పాలన' విమర్శలపై
బీఆర్ఎస్ 'కుటుంబ పాలన' అంటూ బీజేపీ విమర్శలపై ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జ్యోతిరాదిత్య సింధియాను కేంద్ర మంత్రిని ఎలా చేసిందని అడిగారు. గతంలో తమిళనాడులో డీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు, మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు అవి కుటుంబ పార్టీలని తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తాజాగా వైరల్ అవుతున్నాయి.
కులగణనపై
కులగణన చేయాలంటే బీజేపీకి భయమెందుకని కవిత ప్రశ్నించారు. కరోనా వల్ల 2021లో చేపట్టాల్సిన జనగణన వాయిదా పడిన తర్వాత మళ్లీ ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. దేశంలో కులగణన జరగకపోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాన బాధ్యత వహించాలన్నారు. కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల తర్వాత జరిగేది ఇదే
తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, వైసీపీ, బీఆర్‌ఎస్ స్వతంత్రంగా ఎకువ సీట్లు సాధించగలవని కవిత చెప్పారు. బీఆర్‌ఎస్ మాత్రమే కాకుండా ఎవరైనా గేమ్ చేంజర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనమవుతుందని, ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పార్టీల అభిప్రాయం మారవచ్చునని అన్నారు.