ఎన్నికలు రాగానే ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు నేతలు తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. #AskKavitha రాజకీయ అభిప్రాయాలతో పాటు నెటిజన్లు ఆమె వ్యక్తిగత అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. 


చంద్రబాబు అరెస్టుపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు కుటుంబం బాధ, వారి పరిస్థితి అందరికీ అర్థమవుతుందన్నారు. చంద్రబాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు.   






ఏపీలో పోటీచేస్తారా అని మరో నెటిజన్ ప్రశ్నకు.. బాస్ కా హుకుమ్ అని కేసీఆర్ ఫొటోతో కవిత సమాధానం ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 95 నుంచి 105  సీట్లు వస్తాయని .. ఫలితాలపై ఎంత నమ్మకం ఉందని ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. 


మరో నెటిజన్ ఫెవరెట్ హీరో ఎవరనే ట్వీట్ కు స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చిరంజీవి తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టమని తగ్గేదే లే అని పుష్ప స్వాగ్ తో పోస్ట్ చేశారు. 






తనకు ఫెవరెట్ టూరిస్ట్ స్పాట్ నిర్మల్ జిల్లాలోని కుంటాల వాటర్ ఫాల్స్ అని తెలిపారు.


బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదన్నారు. తమది తెలంగాణ టీమ్ అని, బీజేపీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని సూచించారు.


రాహుల్ గాంధీకి, తెలంగాణకు రిలేషన్ ఇదే..
రాహుల్ గాంధీ వాళ్ల ముత్తాత తెలంగాణను బలవంతంగా ఏపీలో విలీనం చేయగా, 6 దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రజలు నష్టపోయారని ఓ నెటిజన్ ప్రశ్నకు కవిత బదులిచ్చారు. ‘రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1969లో తెలంగాణ ఉద్యమం చేస్తే.. 369 మంది ప్రాణాలు కోల్పోయారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణ సీఎం అంజయ్య గారిని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అవమానించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని 2004లో మాట ఇచ్చి 5 ఏళ్లు సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ 11 రోజులపాటు నిరహార దీక్ష చేస్తే 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఇచ్చారు. 12 రోజులకు అంటే డిసెంబర్ 23న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచీ ఇప్పటివరకూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ డిమాండ్లపై కేంద్రంపై మేం పోరాడుతుంటే రాహుల్ మద్దతు తెలపలేదు. ఇదీ రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణకు ఉన్న సంబంధం’ అని కవిత బదులిచ్చారు.