BRS MLC Kavitha Walks Out Of Tihar Jail | న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. హైదరాబాద్ కు వచ్చి విచారించిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారని తెలిసిందే. తిహార్ జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ తిహార్ జైలుకు అందిన తరువాత ఫార్మిలిటీస్ పూర్తి చేశారు. కవిత తరఫున కావాల్సిన డాక్యుమెంట్స్ ను జైలు అధికారులకు ఆమె లాయర్ సమర్పించారు. అనంతరం తిహార్ జైలు నుంచి కవితను జైలు అధికారులు విడుదల చేశారు.





దేశం విడిచి వెళ్లిపోకుండా, చూడటంలో భాగంగా ఆమె పాస్ పోర్ట్ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి కేసులో రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. జైలు నుంచి విడుదలయ్యాక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం షరతులు విధించింది.



 


కవిత భర్త, బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలుకు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన కవిత అటు నుంచి ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కవిత, ఆమె భర్త, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు నేటి రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు.


బుధవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేసు విచారణకు రానుంది. కవిత ఆన్ లైన్ లోనే విచారణకు హాజరవుతారు. విచారణ ప్రక్రియ పూర్తయ్యాక ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 2.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత సహా బీఆర్ఎస్ నేతలు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు.