Kavitha in Delhi Liquor Scame: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల కారణంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తీహార్ జైలు అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఆమెను దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న కవిత.. ఇవాళ నీరసంతో కళ్లు తిరిగిపడిపోవడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలు కవితపై ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల నుంచి కవిత జైలులో ఉండగా.. ఆమె బెయిల్ పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చుతూ ఉన్నాయి. ప్రస్తుతం సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేయగా.. ఆ రెండు కేసుల్లోనూ కవిత అరెస్టు అయ్యారు.


ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తొలిసారిగా మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఈడీ ఈ అరెస్టు చేసింది. అనంతరం కవితను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అయిన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పటికే ఒకసారి అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. ఏప్రిల్ 11న మరోసారి సీబీఐ ఇదే కేసులో అరెస్టు చేసింది. తొలుత ఈడీ కవితను అరెస్టు చేయగా.. తీహార్ జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అయితే, ఈ అరెస్టులపై కవిత తొలి నుంచి న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ పిటిషన్లు వేశారు. ప్రతిసారి అక్కడ ఆమెకు చుక్కెదురు అవుతూనే ఉంది.