బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ మంగళవారం ముగిసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత మంగళవారం విచారణకు మూడోసారి హాజరయ్యారు. నేటి ఉదయం నుంచి 10 గంటల పాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చి, తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసానికి కారులో వెళ్లిపోయారు. ఫోన్ల వాడకంపై ఈడీ కీలకంగా పలు విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయం విచారణకు వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపిస్తూ కవిత విచారణకు వెళ్లడం తెలిసిందే. రెండు కవర్లలో దాదాపు 10 ఫోన్లను మీడియాకు చూపించారు. మరోవైపు కవిత ఏ ఆధారాలు దొరకుండా ఉండాలని తన ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మార్చి 22న విచారణ లేదని కవిత లీగల్ టీమ్ తెలిపింది. విచారణ తేదీని కవితకు మెయిల్ చేస్తామని ఈడీ సూచించింది.






మూడోసారి కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11న తొలిసారి విచారించింది. అయితే ఈ నెల 16న మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా 16న విచారణకు ఆమె గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమె తన లాయర్ తో ఈడీకి లేఖ పంపారు. అయితే దీనిపై స్పందించి ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. సోమవారం రెండోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సుమారు పది గంటలకు పైగా ఈడీ ఆమెను విచారించింది. మంగళవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేయగా.. మంగళవారం మూడోసారి విచారణకు హాజరయ్యారు కవిత. నేడు సైతం 10 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ అనంతరం ఢిల్లీలోని తన తండ్రి కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు. 


ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను ముందుగా విచారణ చేయలేమని 24వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కవిత లేఖ రాశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో  ఎక్కడా పేర్కొనలేదన్నారు. మరోవైపు ఈడీ అధికారులు సైతం కవిత విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేవియెట్ పిటిషన్ దాఖలుచేసింది ఈడీ. కేవలం కవిత పిటిషన్ పై వాదనలు విని ఎలాంటి తీర్పు ఇవ్వకూడాదని, తమ వాదనలు వినాలని ఈడీ తమ పిటిషన్ లో పేర్కొంది.