Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్ధం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీ వచ్చాయని ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రోజా ప్రతిపక్ష నాయకులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2019వ సంవత్సరం నుండి ఏపీ రాష్ట్రంలో ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కి పోయారని ఆరోపించారు. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని అన్నారు. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్ తో గెలవలేదని ఆరోపించారు. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని ఆర్.కే.రోజా వివరించారు. 


జీఓ నెంబర్ వన్ రద్దు అంటే ప్రజలను చంపేందుకు అవకాశమివ్వడమే


టీడీపీ నేతలకు అహంకారం, కళ్లు నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం అని మంత్రి రోజా అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాంను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు సబబు అంటూ ఆమె ప్రశ్నించారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి తమ నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటు అని చెప్పుకొచ్చారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల జాతి వాళ్లకు పదవులు ఇస్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం దురదృష్ట కరమన్నారు. జీఓ నెం.1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా అంటూ ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీఓ నెం.1 తీసుకొచ్చామని, జీఓ నెం.1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అంటూ‌ ఆమె వ్యాఖ్యానించారు. జీఓ నెం.1 రద్దు అంటే ప్రజలను చంపడానికి అవకాశం ఇవ్వడమే అని, వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తే ఏం జరగదని, 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలగానే మిగిలి పోతుందన్నారు. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. 


నోరుంది కదా అని వైసీపీ గురించి, సీఎం జగన్ గురించి  టీడీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడితే చూస్తు ఊరుకోమని రోజా వార్నింగ్ ఇచ్చారు. వై నాట్ పులివెందుల లాంటి కామెంట్లు చేస్తున్న వ్యక్తికి దమ్ముంటే పులివెందుల వచ్చి సీఎం జగన్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అభ్యర్థులు వారి సొంత గుర్తులతో పోటీ చేసి విజయం సాధిస్తే చంద్రబాబు అండ్ టీడీపీ బ్యాచ్ అది తమ విజయం అంటూ సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవంటూ టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. ఫ్యాన్ గుర్తుతో పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా వైసీపీకే ఓట్లు వేస్తారన్నారు.