BRS MLAs Protest At Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసనతో సోమవారం ఉదయం గందరగోళం నెలకొంది. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అని ముద్రించిన టీషర్టులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి వచ్చేందుకు యత్నించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ టీషర్టులు ధరిస్తే అసెంబ్లీ లోపలికి అనుమతించమంటూ భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని అడ్డుకోనప్పుడు ఇక్కడ ఎట్లా అడ్డుకుంటారని కేటీఆర్ పోలీసులు, భద్రతా సిబ్బందిపై మండిపడ్డారు. 'మేము ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా ప్రభుత్వం చెబుతుందా.?' అంటూ నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


గన్ పార్క్ వద్ద నివాళి


అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అమరవీరులను కీర్తిస్తూ గేయాలన్ని ఆలపించారు. 'తెలంగాణ మహా నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు ఇది. దీక్ష ఫలవంతమైన సందర్భంగా దీక్షా విజయ దివస్ నిర్వహించుకుంటున్నాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తున్నాం. రాష్ట్ర ప్రజల తరఫున అన్ని సమస్యలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.' అని కేటీఆర్ పేర్కొన్నారు.






'ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు'






డిసెంబర్ 9.. మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు. ఈ కీలక ములుపు లేకపోతే జూన్ 2న గెలుపే లేదు.' అని పేర్కొన్నారు. దగాపడ్డ నేల విముక్తి కోసం ఉద్యమ సారధే ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన దీక్షా విజయ్ దివస్ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, లక్షలాది గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని కేటీఆర్ తెలిపారు.


'ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు'


తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంది. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి.. తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బతుకమ్మతో పువ్వులను పూజించే  సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరం. బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ రూట్‌లలో కొత్త సర్వీస్‌లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే