బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వీరు ఇద్దరికీ ఏ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు వెళ్తుండగా పాండ్రాకొడ- బోరీ మధ్య ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కొనప్ప ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. వాహనానికి పశువు అడ్డం రాగా.. దాన్ని తప్పించే ప్రయత్నం చేయడంతో అదుపు తప్పి డివైడరును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో ఎమ్మెలేలు జోగు రామన్న, కోనప్పతో పాటు మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. కాగా ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది.


రోడ్డుప్రమాదంపై ఎమ్మేల్యే జోగురామన్న స్పందన


కాన్వాయ్ కి మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరగడంపై మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న స్పందించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే జోగురామన్న వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నాగ్ పూర్ లో జరిగే సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా రోడ్డు మీద ఆకస్మికంగా పశువులు అడ్డం రావడంతో చిన్న రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు. కావున కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతరం నాగ్ పూర్ లో జరిగే కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్నారు.