Mynampalli : తనను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బదులిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. తన కుమారుడికి టిక్కెట్ ప్రకటించకపోవడానికి హరీష్ రావు కారణం అని ఆయనపై తిరుమలలో సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. హైదరాబాద్ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు. తనకు కుమారుడే ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. జీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ బదులిస్తానన్నారు.
మెదక్, మల్కాజిగిరి కార్యకర్తలే తనకు ముఖ్యమన్నారు. తాను ఏ పార్టీనీ విమర్శించనని.. పార్టీలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు. మా అబ్బాయికి టికెట్ ఇస్తే.. గెలిపించుకుని వస్తా అని మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని.. లేకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే హరీశ్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజాసేవ చేశాడన్నారు.
హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నరు. కేటీఆర్ ఇప్పటికే తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. మైనంపల్లి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతనే టిక్కెట్ ప్రకటించారు. దీంతో హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను పార్టీ పట్టించుకోలేదన్న అభిప్రాయం వినిపించింది. దీంతో పార్టీ నేతలు మైనంపల్లిపై విమర్శలు చేస్తున్నరు. తాజాగా కవిత కూడా స్పందించారు.
మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్న- డిమాండ్ వినిపిస్తోంది.