Mynampalli : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మాత్రం మెదక్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో దీంతో మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హన్మంత్ రావు .. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీ చేసి హరీష్ ను ఓడిస్తానని చాలెంజ్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకువచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుకున్నారని.. అందుకే హరీష్ రావును టార్గెట్ చేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యల్లో.. కేసీఆర్ కుటుంబంపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబం పై వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా ఉన్నప్పుడు నువ్వు జీరో వని... రబ్బర్ చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. మీ కుటుంబంలో అందరికీ టికెట్లు ఇచ్చారుగా.. నాకు, నా కొడుకు ఇస్తే తప్పేంటి అని మైనంపల్లి ప్రశ్నించారు. సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు ని ఓడిస్తా.. ఆయన అంతు చూస్తా.. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పై శపథం చేశారు మైనంపల్లి.
మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లాకు చెందిన వారు . తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అవకాశం లభించకపోవడంతో బీఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారీగాసేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండే హన్మంతరావు కుమరుడు కూడా ఇటీవలి కాలంలో మెదక్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన కుమారుడికి మెదక్ నుంచే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు. ఈ కారణంగా రోహిత్ రావుకు టిక్కెట్ నిరాకరించారు.
అయితే ఏ పార్టీలో ఉన్నా గెలిచి తీరుతారమన్న నమ్మకంతో ఉన్న మైనంపల్లి.. ఇద్దరికీ టిక్కెట్ ఇవ్వకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే... తీవ్ర వ్యాఖ్యలుచేసినట్లుగా తెలుస్తోంది.