BRS Chief Kcr Visit Districts Soon: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Kcr) వచ్చే నెలలో తెలంగాణ భవన్ కు వచ్చి రోజూ కార్యకర్తలను కలుస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) వెల్లడించారు. శనివారం హైదరాబాద్ (Hyderabad) లోని పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కడియం శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సహా పెద్దపల్లి నియోజకవర్గం నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షిస్తూనే, రాబోయే లోక్ సభ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు. 


ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని.. ఎవరూ అధైర్యపడొద్దని హరీష్ రావు పునరుద్ఘాటించారు. 'తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పని చేయాలి. మున్ముందు మంచి రోజులు వస్తాయి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది.' అని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా.. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని వెళ్లి సర్కారును నిలదీస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. 


'ఏడాదిలో తిరుగుబాటు'


ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందంటూ హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం ఇంకా రైతు బంధు డబ్బులు వేయలేదని.. ఇలా అయితే రైతులు వ్యవసాయం ఎలా చేయాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక చర్యలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ, వాటిపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం కేసీఆర్ కిట్లపై కేసీఆర్ గుర్తును తొలగించినా.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.


మరోవైపు, ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ఇలా చేయడాన్ని ఖండిస్తూ నిరసనలు చేపడతామని వెల్లడించారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలపై లబ్ధిదారుల తరఫున ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ పథకాలు రద్దు చేయడమంటే బలహీన వర్గాలు, దళితులకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలకు కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తూ.. ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.


Also Read: Telangana News: పెండింగ్ చలాన్లు చెల్లించారా.? - వాహనదారులకు బిగ్ అలర్ట్