నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మేల్యే విఠల్ రెడ్డి తీరుని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. భైంసా, బాసర జడ్పీటీసీలు, ఒక ఎంపీపీ, 10 మంది సర్పంచ్‌లు, 8 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నాయకులతో పాటు దాదాపు 500 మంది కార్యకర్తలు పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. విఠల్ రెడ్డి కేవలం తన మద్దతుదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలంగాణ ఉద్యమనేత, మార్కెట్ కమిటి ఛైర్మన్ జాదవ్ రాజేష్ బాబు పాటు పలు నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు మీడియాతో తెలిపారు. 


బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్యకు చేదు అనుభవం
మరోవైపు, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది. నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామంలో సోమవారం (అక్టోబరు 23) పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గ్రామ సమస్యలపై నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప చేశారు.