Maar Muntha Chod Chinta Song In Trouble | హైదరాబాద్: టాలీవుడ్ దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ వివాదంలో చిక్కుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా, పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీలోని పాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాడిన హుక్ లైన్ వాడి ఆయనను అవమానించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూవీ టీమ్‌పై బీఆర్ఎస్ నేతలు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డైలాగ్ తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.


అసలేంటి వివాదం..
డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ‘మార్‌ ముంత చోడ్‌ చింత..’ అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. మరోవైపు మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హుక్ లైన్ ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అని మాటల్ని వాడేశారు. ఈ పాట రాసిన కాసర్ల శ్యామ్‌ పై, ఆ పదం వాడిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఐటం సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్‌ను వాటం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, చాలా అభ్యంతరకరమైన విషయం అంటూ ఎల్బీనగర్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు జి. సతీష్ కుమార్, ఎం రజితా రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ యాస, భాషలను కించపరచడం లాంటివి చేసినా, ఉద్యమనేత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కించ పరిచినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంగ్ నుంచి ఆ డైలాగ్‌ను తొలగించాలని, లేకపోతే మూవీ దర్శక, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


గతంలోనూ పూరీ మూవీతో వివాదం
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అప్పట్లో వివాదంలో చిక్కుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా వచ్చిన ఆ   సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయని పలువురు తెలంగాణవాదులు అప్పట్లో ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్‌ను తెలంగాణ నాయకులను అన్వయించారంటూ మండిపడ్డారు. తెలంగాణలో పలుచోట్ల ఉద్యమకారులు ఆందోళన చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరు మారలేదని, డబుల్ ఇస్మార్ట్ మూవీలోని ఐటం సాంగ్‌లో తమ అధినేత కేసీఆర్ డైలాగ్ ను వాడి కించ పరిచే ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై క్షమాపణ చెప్పి, డైలాగ్ తొలగించాలని లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


మరోవైపు వివాదాలతో ప్రచారం వచ్చిన సినిమాలకు మరింత హైప్ వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ మూవీకి కేసీఆర్ డైలాగ్ కావాల్సినంత హైప్ తెచ్చిందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మూవీ యూనిట్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో అని ఆసక్తి నెలకొంది.