BRS leaders complained to the Speaker  :  ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. 


ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడని గుర్తు చేశారు. అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా? అని ప్రశ్నించారు.  మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని తెలిపారు. మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందుకు వేస్తామన్నారు. ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు. మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చినప్పుడు తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఐదేళ్లు మేము ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండొచ్చన్నారు.  



అయితే బీఆర్ఎస్ నేతల పై  కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని ఎమ్మెల్యే తెలిపారు. 


2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని.. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తెలిపారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని అన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా.. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల పైన చర్యలు తీసుకున్నారా..?అని ప్రశ్నించారు.  ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయని ఆరోపించారు. ప్రమాణస్వీకారానికి ముంది కడియం శ్రీహరి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అనలేదా…? అని ప్రశ్నించారు.