Telangana Congress Akarsh :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ లో స్వామిగౌడ్ నివాసానికి వెళ్లారు. స్వామిగౌడ్ తో పాటు కుటుంసభ్యులతో చర్చించారు. పార్టీలో చేరిక ఆహ్వానంపై స్వామిగౌడ్ ఎలా స్పందించారన్నదానిపై ఇంకా స్పష్టత  రాలేదు. పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తోనూ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.


టీఎన్జీవో నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్.. బీఆర్ఎస్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాసన మండలి తొలి చైర్మన్ గా ఆయనకు కీలక పదవి అప్పగించారు కేసీఆర్. గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్‌ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ అయిన స్వామిగౌడ్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్‌ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్‌ అసంతృప్తికి గురయ్యారు.                  


తర్వాత 2020లో ఆయన బీఆర్ఎస్ ని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ కూడా ఆయన ఉండలేకపోయారు. 2022లో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్ గురించి పునరాలోచించారు. పొన్నం ప్రభాకర్ ఆహ్వానంతో కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.రేవంత్ రెడ్డితో  స్వామిగౌడ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.                          


గతంలో   సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పొగిడారు.  ‘బడుగు, బలహీనవర్గాలకు రేవంత్‌రెడ్డి బలమైన వెన్నుపూస, చేతికర్రగా మారారు. తెల్లబట్టల నేతలకు అమ్ముడుపోవద్దు’అంటూ  రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ‘తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్‌ అన్న పాత్ర ఎవరూ కాదనలేనిది. సమైఖ్య పాలనలో ఆయనపై దాడిచేసిన అధికారులకు కీలక బాధ్యతలిచ్చారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల బిడ్డను గుర్తింపులేకుండా పక్కనపెట్టారు’అని రేవంత్‌రెడ్డి కూడా ప్రశంసించారు. అయితే  అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అంతే  కాదు..  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా కూడా లేరు. అందుకే కాంగ్రెస్ లో చేరకుండా బీజేపీలో చేరారు. ఇప్పుడు రేవంత్ కూడా ఆహ్వానించే అవకాశం ఉంది.. ఉద్యమకారులకు గుర్తింపునిస్తామని రేవంత్ చెబుతున్నారు కాబట్టి పార్టీలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.