BRS MP Ramulu Resign: నాగర్‌కర్నూల్‌ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రేపు ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన తాజాగా బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబర్చారు.


కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


మరోవైపు, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశిస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఆయన ఢిల్లీలో కీలక పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు మల్లు రవి ప్రకటించారు. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతో పోతుగంటి రాములు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో రాములు కుమారుడు భరత్.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.