BRS Leader Manne Krishank vs Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకురాబోతున్న కొత్త మద్యం పాలసీ (New Liquor Policy)పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక పత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని జూపల్లి అన్నారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్‌ల మద్యంకు అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారు. కానీ సోం డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణలో కొత్త బీర్లు తీసుకువస్తోంది. దీనిని బట్టి మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది’ అని విమర్శించారు.
అక్రమ మద్యానికి తలుపులు తెరుస్తారా?
‘సోమ్ డిస్టిలరీస్‌లో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచింది. 2013-14లో మరో రూ.25 లక్షలు, 2019లో సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి రూ.1.31 కోట్లు విరాళాలు ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారు. మధ్యప్రదేశ్‌లో సోమ్ డిస్టిలరీస్ సంస్థను సీజ్ చేశారు. పలుసార్లు ఆ డిస్టిలరీస్‌పై అధికారులు దాడులు జరిగాయి. కానీ సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారు’ అని మన్నె మండిపడ్డారు
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
‘సోమ్ డిస్టిలరీస్ తెలంగాణకు వస్తున్న విషయం జూపల్లికి తెలుసా? తెలియదా? తెలంగాణలో బీర్లు అమ్మడానికి సోమ్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని మన్నె క్రిషాంక్ ధ్వజమెత్తారు.
తెలంగాణలోకి కొత్త బీర్లు ఎంట్రీ!
తెలంగాణలోకి కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొత్త బ్రాండ్ బీర్లు ఇవేనంటూ ఫొటో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ సరఫరా చేసుకునేందుకు సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందినట్లు ప్రచారం సాగుతోంది. పవర్ 1000, హంటర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీకర్ వంటి పేర్లతో కొత్త బీర్లు షాపుల్లోకి అందుబాటులోకి రానున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్, ఆర్‌సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉన్నాయి.
ఖండించిన జూపల్లి
తెలంగాణలో కొత్త బీర్లు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, వాటిని తాను పరిశీలించలేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, పెండింగ్ బిల్లులు ఉన్న కంపెనీలు ఎక్కవగా బీరు సరఫరా చేయలేకపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం కృత్రిమ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు
తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశ ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తు్న్నారు. రాష్ట్రంలో మద్యం కొరత సృష్టించి కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీర్ బ్రాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.