Stalin Meeting:  దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు 22వ తేదీన చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. డీఎంకే పార్టీకి చెందిన వారు కేటీఆర్ ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. స్టాలిన్ కు సంస్కారం ఉంది. ఆహ్వానించారని తాము హాజరవుతామన్నారు. తెలంగాణలో ఇంత వరకూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. 

అయితే డీఎంకే నాయకులు రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల‌తో కూడిన ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేయాలని స్టాలిన్ అనుకుంటున్నారు.  భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒక ప్ర‌తినిధిని నియ‌మించాల‌ని  స్టాలిన్ కోరుతున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల‌ను అడ్డుకుంటామ‌ని  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను ఎదుర్కోవాల‌ని కాంగ్రెస్ పార్టీ సూత్ర‌ప్రాయంగా ఇప్ప‌టికే నిర్ణ‌యించింద‌ని ... కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమ‌తి తీసుకొని తాను చెన్నై స‌మావేశానికి హాజ‌ర‌వుతాన‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారు. 

డీఎంకే కాంగ్రెస్ కూటమిలో కీలక పార్టీ . ఆ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వెళ్లకపోతే కూటమిలో విబేధాలు వస్తాయి. కర్ణాటక తరపున ఉపముఖ్యమంత్రి శివకుమార్ హాజరవుతున్నారు. తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి హాజరవుతారా.. భట్టి విక్రమార్క హాజరవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇద్దరిలో ఎవరో ఒకరు హాజరవుతారని అంచనా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ హాజరయ్యే సమావేశానికి బీఆర్ఎస్ హాజరవుతాందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేటీఆర్ ఇప్పటికిప్పుడు హాజరవుతామని ప్రకటించి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీతో ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి పార్టీలతో వేదిక పంచుకోవడం అనేది అనేక రాజకీయ సమీకరణాలకు కారణం అవుతుంది. 

దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్న దానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నిష్ఫత్తిలోనే సీట్ల కేటాయింపు డీ లిమిటేషన్ లోనే ఉంటుందని చెబుతున్నారు. అయితే జనాభా ప్రాతిపదికగా సీట్లు విభజిస్తారని నమ్ముతూ పోరాటానికి రెడీ అవుతున్నారు. కానీ రాజకీయ అంశాలు ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో  కేటీఆర్ నిర్ణయం సంచలనాత్మకం అవుతుంది. కాంగ్రెస్ కూటమి పార్టీల సమావేశంలో ఆయన  పాల్గొంటే తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తాయి.