Microsoft Skill Training: ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్. ఏఐలో యువత నైపుణ్యాలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. ఏడాది వ్యవధిలో రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐటీ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయడమే ఈ  ఒప్పందం లక్ష్యం.  రెండు లక్షల మంది రాష్ట్ర యువతకు అంతర్జాతీయంగా ఉద్యోగాలు వచ్చేలా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది.  

ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యం               

వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్ష్యంతో ప్రభుత్ం ఉంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నారు. అదే సమయంలో స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని అనుకుంటున్నారు. స్కిల్ సెన్సెస్ ద్వారా ఎవరెవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి..  వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు అవసరం అన్నదానిపై పరిసీలన చేయనున్నారు. ఆ తర్వాత వారికి తగ్గ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు  ఏర్పాట్లు చేస్తారు.  

విస్తృత శిక్షణకు మైక్రోసాఫ్ట్ ఏర్పాట్లు         

మైక్రోసాఫ్ట్    50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 500 మంది అధ్యాపకులు, 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై   శిక్షణ ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని  30 ఐటీఐలలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణను అందిస్తారు.  యునిసెఫ్ భాగస్వామ్యంతో పాస్​పోర్ట్ టు ఎర్నింగ్ 2.0ని ప్రవేశపెట్టేందుకు వీలుగా 40,000 మందికి, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సహకారంతో మరో 20,000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.  ప్రభుత్వాధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50,000 మందికి 100 గంటలపాటు AI శిక్షణ అందిస్తుంది.           

ఏపీ విద్యార్థులకు వరమే        

అలాగే వెబినార్‌ల ద్వారా 20,000 మంది మంది సిబ్బందికి AI అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌ను అందిస్తారు. విద్యాసంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్​ను మైక్రోసాఫ్ట్ అందజేస్తుంది.  మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ ఏపీ యువతకు అద్భుత వరం అనుకోవచ్చు.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు ఈ రంగంలో కలగనున్నాయి.  అయితే ఏఐ లెర్నింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే ఎక్కువ మంది ఈ కోర్సులు నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉచితంగా ఈ తరహా ట్రైనింగ్ ఇవ్వనుంది.