KCR Kaleshwaram Commission: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు బుధవారం హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై, బూర్గుల రామకృష్ణారావు భవన్ లో జరుగనున్న పీ సీ ఘోష్ కమిషన్ విచారణకు,  11.06.2025 బుధవారం ఉదయం 11.30 గంటలకు హాజరు కానున్నారు. ఉదయమే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అక్కడ్నుంచి ర్యాలీగా బీఆర్కే భవన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

రాజకీయంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్            

ఇది రాజకీయ పరమైన కేసుగా భావిస్తున్న బీఆర్ఎస్ రాజకీయంగానే ఎదుర్కోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు అంతర్గతంగా సమాచారం ఇచ్చారు. ఉదయం కల్లా హైదరాబాద్ చేరుకోవాలని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు.. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మోహరించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్దకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని.. తెలంగాణ భవన్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ విచారణ  గంట నుంచి రెండు గంటలు సాగే అవకాశం ఉంది. ఈ లోపు హైదరాబాద్ మొత్తం బలప్రదర్శన చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.       

ఇన్ కెమెరాలో కేసీఆర్ స్టేట్ మెంట్ రికార్డు           

ఇప్పటి వరకూ సాక్షుల్ని బహిరంగ విచారణ చేశారు.  ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా ముందు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరయ్యేలా అవకాశం కమిషన్ కల్పించినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఇంజినీర్లతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించింది. హరీష్ రావు,  ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. చివరికి కేసీఆర్ హాజరువుతున్నారు. కేసీఆర్ చుట్టూనే ఈ విచారణ జరుగుతోంది కాబట్టి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఆసక్తికరం.               

భారీ బలప్రదర్శనకు నిర్ణయం           

ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవ్వాలని నిర్ణయించడమే కీలకమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  కమిషన్ చట్టబుద్ధతను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా.. అలా చేయడం వల్ల.. వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉందన్న కారణంగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా అడిగే అవకాశం ఉన్న విషయాలపై ఇప్పటికే కేసీఆర్ కసరత్తు చేశారు. ఆయన ఏం సమాధానాలిచ్చనా అవి బయటకు వచ్చే అవకాశం లేదు.లీకులు మాత్రమే వస్తాయి.            

ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష పూరితమన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపాలని  బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే బలప్రదర్శనను ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్ోతంది.