Kishan Reddy: కేంద్రం అధికారికంగా చేపట్టిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరగకుండా కుట్రలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడతూ.. ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరగకుండా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, మజ్లి్‌స్ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటున్న ఈ ఉత్సవాలను దెబ్బతీసేందుకు అదే రోజున బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు సభలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. 


విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సారి రాష్ట్రపతి భవన్‌లోనూ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్దిచెప్పే సమయం దగ్గరపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.


తమకు నచ్చినోళ్లకే బీసీ బంధు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. బీసీ బంధు అమలులో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. బీసీ కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామంటూ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. నిబంధనలకు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన 93 కులాల్లో కేవలం 14 కులాలకు మాత్రమే బీసీ బంధు ఇస్తున్నారని అది కూడా  రాష్ట్ర ప్రభుత్వం.. అధికార పార్టీ నాయకులకు, తమకు నచ్చినోళ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. మిగతా కులాల వారికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 


ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రతి నెలా 15న బీసీ బంధు అందిస్తామని చెప్పిన సర్కార్, ఆతరువాత వాటిని తుంగలో తొక్కిందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్‌ఎస్ నియోజకర్గ ఇంచార్జీలతో అందిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే బీసీ బంధు ఇస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి పక్ష ఎమ్మెల్యేలు 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్య రాష్ట్రంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. నియోజవకర్గ అభివృద్ధి నిధులు, ఎస్‌డీఎఫ్ నిధులను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదన్నారు.


బీజేపీ టికెట్‌ కోసం భారీగా ఆశావహులు
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జీలను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆ జాబితాను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ కోసం పెద్దసంఖ్యలో ఆశావహులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో రద్దీని తగ్గించేందుకు దరఖాస్తుల స్వీకరణ కమిటీ ఆశావహులకు టోకెన్‌లు ఇచ్చింది. ఒకదశలో కౌంటర్‌ కొద్దిసేపు మూసివేశారు. 


దుబ్బాక టికెట్‌ మరోసారి తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దరఖాస్తు అందజేశారు. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి సికింద్రాబాద్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గజ్వేల్‌ టికెట్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని పలువురు నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధులు విఠల్‌(సంగారెడ్డి,) సంగప్ప (నారాయణఖేడ్‌), సుధాకర్‌శర్మ(మహేశ్వరం), మిథున్‌రెడ్డి(షాద్‌నగర్‌), ఆకుల విజయ(సనత్‌నగర్‌), గోపి(నర్సాపూర్‌), గూడూరు నారాయణరెడ్డి(భువనగిరి), సతీష్ కుమార్‌(పాలకుర్తి) బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ కులానికి 36 సీట్లు కేటాయించాలని మున్నూరుకాపు సంఘం నాయకులు కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవడేకర్‌కు వినతిపత్రం ఇచ్చారు.