Kcr Sensational Comments on CM Revanth Reddy: తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం పరిశీలించిన ఆయన.. సూర్యాపేటలోని (Suryapeta) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి.?. సాగునీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారని.. ముందే చెబితే వేసుకునే వాళ్లం కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టకాలం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.' అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'పదేళ్లలో రైతుల అనుకూల విధానాలు'
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల అనుకూల విధానాలు చేపట్టామని.. వ్యవసాయాన్ని అద్భుతమైన దశకు తీసుకెళ్లామని కేసీఆర్ అన్నారు. 'రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించాం. సకాలంలో అన్నదాతలకు సాగునీరు అందించాం. పండిన ప్రతి గింజను కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్ ను దాటేశాం. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మా హయాంలో తాగునీటి సమస్యను పక్కా ప్రణాళికతో అధిగమించాం. ప్రపంచం మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయి.?. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై బిందెలు పట్టుకుని ఏ ఆడబిడ్డా కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు సైతం కనిపించలేదు. నేడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భాగ్యనగరంలో కూడా నీళ్లు ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి.?. ఎన్నో సమస్యలు అధిగమించి రైతులు, గృహ అవసరాలకు నిరంతరం కరెంట్ సరఫరా చేశాం. అప్పట్లో కరెంట్ పోతే వార్త. ఇప్పుడు మాత్రం ఉంటే వార్త. అగ్రగామిగా ఉన్న రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి.?. ప్రభుత్వ అసమర్థత వల్లే.. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు వస్తున్నాయి. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించాం. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గత 8 ఏళ్లుగా బోరు బండ్లు బంద్ అయితే, ఇప్పుడు పల్లెల్లో బోర్ల హోరు వినిపిస్తోంది. ఇప్పటికీ సాగర్ లో 14 నుంచి 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది.' అని కేసీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ పై విమర్శలు
కేంద్ర మంత్రులు తియ్యగా మాట్లాడితే.. కేఆర్ఎంబీకి అంతా అప్పగించేశారని, ఈ ముఖ్యమంత్రికి రైతుల బాధ పట్టదని.. ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 'ఒక్కరినో.. ఇద్దరినో మీవైపు గుంజుకుని ఆహా ఓహో అనొద్దు. అధికారం వస్తుంటుంది. పోతుంటుంది. బీఆర్ఎస్ సముద్రమంత పార్టీ. ప్రభుత్వం మారిన నాలుగో నెల వరకూ నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు లక్షల ఎకరాలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. వాగ్దానాలు అమలు చేయకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం. డిసెంబర్ 9 నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తామన్న సీఎం ఏరీ.?. పోలీసులకు నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు అతిగా పోవొద్దు. మేమూ ఇలాగే చేసుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేదే కాదు. రైతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.' అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 6న నిరసన దీక్షలు
అన్ని పంటలకు రూ.500 బోనస్ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 6న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
Also Read: Khammam News: పోడు భూముల వివాదం - పోలీసులపై గిరిజనుల దాడి, ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత