KCR Responds On Telangana Thalli New Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్య.. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా.?' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవ్వాలని.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.


'మార్చుకుంటూ పోతే ఎలా.?'


ప్రభుత్వాలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని.. విగ్రహాలను మార్చుకుంటూ పోతే ఎలా అంటూ గులాబీ బాస్ ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు రావాలి. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యా రంగంలో వైఫల్యాలను ఎండగట్టాలి. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కారు వైఖరిని ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.


కాగా, ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. కుడి చేతిలో తెలంగాణ ప్రజలు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి.. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో నిండైన రూపంలో విగ్రహాన్ని కొలువుదీర్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చేతిలో బతుకమ్మ ఉంటే బీఆర్ఎస్‌కు క్రెడిట్ ఉంటుందని.. కాంగ్రెస్ వాళ్లు కావాలనే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేశారు. హస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి అభయహస్తం ఇస్తున్నట్లు కొత్త రూపం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహం సవతి తల్లి వంటిదని.. అసలైన తెలంగాణ విగ్రహం తమదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు తల్లి విగ్రహం.. నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా.? అని ప్రశ్నిస్తున్నారు. 


పోటాపోటీగా విగ్రహావిష్కరణలు 


సోమవారం అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రెండూ పోటాపోటీగా విగ్రహాలను ఆవిష్కరించనున్నాయి. సోనియాగాంధీ పుట్టినరోజు, ఏడాది ప్రజాపాలన ముగింపు సంబురాలను ఘనంగా నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయంలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. మేడ్చల్ జిల్లా పాత కార్యాలయంలో తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని కేటీఆర్ పునరావిష్కరించనున్నారు. మరోవైపు, కేసీఆర్‌కు సైతం ప్రభుత్వం విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం పంపింది.


Also Read: Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?