BRS Protest Against New Statue Of Telangana Thalli: డిసెంబర్ 9వ తేదీ సోమవారం.. తెలంగాణలో అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ పార్టీలకు బిగ్ డే. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏడాది ప్రజా పాలన ముగింపు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలో తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహావిష్కరణ కీలక ఘట్టం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసిన విగ్రహాన్ని అధికారికంగా గుర్తించని కాంగ్రెస్ సర్కారు.. ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సిద్ధం చేయించింది. 'రాచరికపు హావ భావాలకు భిన్నంగా.. వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాం.' అన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మేరకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు.
ఇవీ ప్రత్యేకతలు..
- కుడి చేతిలో తెలంగాణ ప్రజలు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి.. గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యం చాటి చెప్పేలా రూపం ఉంది.
- తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో నిండైన రూపంలో కొలువైంది. ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి.
బీఆర్ఎస్‌కు క్రెడిట్ వస్తుందనే..
అయితే, తెలంగాణ తల్లి కొత్త రూపంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చేతిలో బతుకమ్మ ఉంటే బీఆర్ఎస్‌కు క్రెడిట్ ఉంటుందని.. కాంగ్రెస్ వాళ్లు కావాలనే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేశారు. హస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి అభయహస్తం ఇస్తున్నట్లు కొత్త రూపం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహం సవతి తల్లి వంటిదని.. అసలైన తెలంగాణ విగ్రహం తమదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు తల్లి విగ్రహం.. నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా.? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సామాన్య తెలంగాణ మహిళను గుర్తు చేసేలా కొత్త విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ సర్కారు చెబుతోంది.
కేసీఆర్‌కు ఆహ్వానం.. వెళ్తారా.?
అటు, ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయన్ను కలిసి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం పలికారు. అయితే, ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కారని తెలుస్తోంది. తన ప్రొఫైల్ పిక్‌ను ఆయన తాజాగా ఇప్పటివరకూ ఉన్న తెలంగాణ తల్లి ఫోటోనే అప్ డేట్ చేశారు. దీంతో కొత్త రూపంపై ఆయన నిరసన తెలిపినట్లైంది. మరోవైపు, సోమవారం పోటాపోటీగా విగ్రహాల ఆవిష్కరణ ఉంది. ఒకే నగరంలో.. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వేర్వేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సోమవారం కొత్త విగ్రహం ఆవిష్కరించనుండగా.. అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించనున్నారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే..
ప్రభుత్వం రూపొందించింది కాంగ్రెస్ తల్లి విగ్రహమని.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని బీఆర్ఎస్ మండిపడుతుండగా.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విగ్రహాన్ని మార్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా విగ్రహాలు, సంబరాల పాలిటిక్స్ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.