Kcr Letter To CM Revanth Reddy:  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సిద్ధమవుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy).. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.


లేఖలో ఏం చెప్పారంటే.?


'తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ పోరాట ఫలితం.. అమరుల త్యాగాల పర్యావసానం. కానీ కాంగ్రెస్ దయాభిక్షగా చేస్తోన్న ప్రచారం నిరసిస్తున్నా. 1969 నుంచి 5 దశాబ్దాలు, భిన్న దశల్లో, భిన్న మార్గాల్లో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని, బీఆర్ఎస్‌తో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిరసిస్తున్నాం. ఇక ముందైనా ఇలాంటి వైఖరి మానుకోవాలి. నిజమైన ప్రగతి, సంక్షేమం కోసం ప్రయత్నించాలి. ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరగా నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాం.' అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.


Also Read: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ