Bandi Sanjay Letter To Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో సీబీఐను నిషేధిస్తూ గత ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని.. వాటిని రద్దు చేయాలని అన్నారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా మరుగున పడేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఈ వ్యవహారాన్ని నడిపించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు జరగుతున్నాయని.. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. 


'అత్యంత తీవ్రమైన నేరం'


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత తీవ్రమైన నేరమని.. దీనికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదని బండి సంజయ్ అన్నారు. కానీ, అలా జరగకపోవడంతో దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులను ఫోన్ ట్యాపింగ్‌తో కాలరాశారన్నారు. దీని కోసం విదేశాల నుంచి పరికరాలు తెప్పించారని.. వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సహా తమ అవసరాలను తీర్చుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ లేఖలో కోరారు.


'ఆహ్వానం ఎందుకు పంపలేదు.?'


అటు, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ఉద్యమకారులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా కీలకమని.. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం రేవంత్ చాలాసార్లు కొనియాడారని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అధికారిక కార్యక్రమానికి బీజేపీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.


Also Read: Warangal News: ఒక్క రూపాయి కోసం వివాదం - వ్యక్తి మృతి, వరంగల్‌లో ఘటన