Brs Chief Kcr Bus Yatra: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి ఆయన ప్రజల్లోకి రానున్నారు. ఆ రోజు చేవెళ్ల (Chevella) బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బహిరంగ సభల కంటే బస్సు యాత్రల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచే బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 13న కేసీఆర్ చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. 


ఇటీవలే పొలంబాట


రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించాలని కేసీఆర్ ఇటీవల పొలంబాట పట్టారు. అందులో భాగంగా ఈ నెల 5న కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. పలు నియోజకవర్గాల్లో ఎండిన పంటలు పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలువురు రైతులు ఆయనకు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గులాబీ బాస్ దృష్టికి తెచ్చారు. మంచినీళ్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు చెప్పారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జనగామసూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు. 










ప్రభుత్వంపై విమర్శలు


తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. పంటలు పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి.?. సాగునీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారని.. ముందే చెబితే వేసుకునే వాళ్లం కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టకాలం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.' అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.


Also Read: Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు