Happy Birthday Akhil Akkineni: అక్కినేని మూడో తరం నట వారసుడిగా నడవడం, మాట్లాడటం రాని వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు అఖిల్. తన బోసి నవ్వులతో, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో 'సిసింద్రీ'గా చెరగని ముద్ర వేసుకున్నారు. 'అఖిల్' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి, తన ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఐదు చిత్రాల్లో నటించినా, తన కష్టానికి తగిన సరైన బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ తీసుకోడానికైనా సిద్ధంగా ఉండే యూత్ కింగ్ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 8). ఈ నేపథ్యంలో అఖిల్ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ, యువ హీరో సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 



  • కింగ్ అక్కినేని నాగార్జున, అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జన్మించాడు అఖిల్. చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర ఆస్ట్రేలియాలో రెండేళ్ళ పాటు చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదు తిరిగి వచ్చి ఓయాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో బీబీఏ చేసిన అఖిల్... న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్ం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసారు.

  • లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున వారసుడిగా ఏడాది ప్రాయంలోనే 1995లో 'సిసింద్రీ' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసాడు అఖిల్. ఇది 'బేబీస్ డే అవుట్' అనే హాలీవుడ్ మూవీకి రీమేక్. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడమే కాదు, అఖిల్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ తెచ్చిపెట్టింది.

  • 2014లో అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కలిసి నటించిన మెమరబుల్ మూవీ 'మనం'లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు అఖిల్. తన తాతయ్య చివరి సినిమాలో తండ్రి, సోదరుడితో కలిసి క్లైమాక్స్ సీన్ లో ఆకట్టుకున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఆల్-టైమ్‌ బెస్ట్ తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. 




  • 21 ఏళ్ళ వయసులో వీవీ వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో పూర్తి స్థాయి కథానాయకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు అఖిల్. 2015లో హీరో నితిన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయినప్పటికీ డెబ్యూ హీరోగా అక్కినేని వారసుడు భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. సినిమాలో అతని స్క్రీన్ ప్రెజన్స్ కి, డ్యాన్సులు ఫైట్స్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిలిం ఫేర్, సైమా అవార్డులు అందుకున్నారు.

  • 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' (2017) మూవీతో అఖిల్ ను రీలాంచ్ చేశారు నాగార్జున. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో, సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇందులో అఖిల్ 'ఏవేవో కలలు కన్నా..' అనే పాట పాడి సింగర్ గా మారాడు.

  • వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ చేసిన 'మిస్టర్ మజ్ను' (2019) సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం అఖిల్ కు తొలి విజయాన్ని రుచి చూపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

  • 2023లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన 'ఏజెంట్' సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ మూవీ కోసం అఖిల్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది.

  • ఈసారి ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్... యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ కి కమిటైనట్లు తెలుస్తోంది. 'సాహో' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తారు. దీనికి 'ధీర' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.   




  • అఖిల్ కు గుర్రపు స్వారీ, క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే వాటిల్లో శిక్షణ తీసుకొని అన్ని మెళకువలు నేర్చుకున్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అఖిల్.. రెండుసార్లు తన జట్టును విజేతగా నిలిపారు. ఇటీవల జరిగిన సీసీఎల్ కొత్త సీజన్ లోనూ అక్కినేని వారసుడు తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.

  • అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోనప్పటికీ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకూ కార్బన్ మొబైల్స్, మౌంటెన్ డీవ్, టైటాన్, ఫిట్ ప్లాట్ ఫుట్ వేర్ లతో పాటుగా పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

  • వ్యాపార దిగ్గజం జివి కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌ ను ప్రేమించిన అఖిల్... 2016లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచీ యువ హీరో సింగిల్ గానే ఉంటున్నాడు. 


Also Read: అటు బాలయ్య, ఇటు రవితేజ - ఏకంగా 10 క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్!