యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తూ దానికి బానిసైన చెల్లిని క్షణికావేశంలో హతమార్చాడో అన్న. తమది పరువుగల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టి తమను బజారుకీడ్చొద్దని చెల్లిని హెచ్చరించాడు. అయినా చెల్లెలు తన మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో ఆగ్రహించిన అన్న విచక్షణ కోల్పోయి చంపేశాడు. ఇంట్లో ఉన్న రోకలి తీసుకుని చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన చెల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. ఈ ఘోరమైన ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈ ఘటన జరిగింది. 


వద్దని చెప్పినా వినకుండా
రాజీవ్‌నగర్‌ తండాకు చెందిన అజ్మీరా శంకర్‌, దేవీకు అమ్మాయి అజ్మీరా సింధు (20), అజ్మీరా హరిలాల్ సంతానం. సింధు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పని చేస్తోంది. హరిలాల్‌ పనులకు వెళ్లేవాడు. తండ్రి అజ్మీరా శంకర్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అజ్మీరా దేవి కూలీ పనులకు వెళుతోంది. నర్సుగా పనిచేస్తూనే సింధు సరదాగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. ఇది అన్న హరిలాల్‌కు నచ్చలేదు.


యూట్యూబ్‌లో వీడియోలు చేయొద్దని, తమది పరువు గల కుటుంబమని ఇంటి పరువు తీయొద్దని సూచించాడు. పలు మార్లు హెచ్చరించాడు. అయినా సింధు తన సోదరుడి మాటలు పట్టించుకోకుండా పోస్టు చేస్తోంది. ఈ విషయంలో సింధు, హరిలాల్‌ కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. తల్లి వీరిని వారిస్తూ వచ్చింది. అన్న చెల్లెల్లు గొడవ పడొద్దని చెబుతూ వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది.


ప్రాణం తీసిన క్షణికావేశం
ఇదే విషయంపై గత సోమవారం కూడా ఇంట్లో సింధు, హరిలాల్ మధ్య  తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలన్నీ డిలీట్‌ చేయాలని, ఇకపై వీడియోలు చేయవద్దని హరిలాల్ సింధును హెచ్చరించాడు. ఇందుకు సింధు అంగీకరించలేదు. కోపోద్రిక్తుడైన హరిలాల్‌ ఇంట్లో ఉన్న రోకలిబండతో సింధు తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబసభ్యులు తొలుత ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి, తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సింధు మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


సోషల్ మీడియా ప్రభావం
ఆధునిక యుగంలో సాంకేతికత అందరికి అందుబాటులోకి వస్తోంది. 4G, 5G ఇంటర్నెట్ స్పీడ్ యువతను సోషల్ మీడియా వైపు తిప్పుతోంది. యువత తమ చేతిలోని సెల్‌ఫోన్‌లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలో యువత తమ ఫాలోవర్ల్లను పెంచుకునేందుకు, గుర్తింపు తెచ్చుకునేందుకు ఇన్‌స్ట్రాగ్రాంలో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్, ట్విటర్,  ఇతర సామాజిక మాధ్యమాల్లో షార్ట్, వైరల్ వీడియోలో చేస్తున్నారు. ఇవి కొన్నిసార్లు శృతి మించుతున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇంట్లో పెద్దలు చెప్పిన మాట వినకుండా వీడియోలకే బానిసలవుతుండడంతో కుటుంబ సభ్యుల కోపానికి కారణమవుతున్నాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial