AP Telangana Breaking News: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారు. నేతల వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేతల ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతాం. మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకుంటాం. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్‌లైన్ సరికాదు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అంబటి రాంబాబులకు సంబంధించిన ఆడియో టేపు లీకవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఎంపీ సంతోష్ కుమార్‌కు తన చెల్లెలు కవిత సహా మరో సోదరి రాఖీ కట్టారు. ‘‘చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవడం మర్చిపోలేని విషయం. ప్రతి రక్షా బంధన్ మర్చిపోలేని అనుభూతులను మిగుల్చుతుంది. నా చెల్లెళ్లు రాఖీ కట్టడంలో అప్పటికీ ఇప్పటికీ ఎఫెక్షన్ ఇంకా పెరిగింది’’ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. తాము టీనేజ్‌లో ఉండగా రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా ఎంపీ ట్వీట్ చేశారు.
ఈటల రాజేందర్ అన్నకు అండగా ఉంటామని అన్న కష్టం మా కష్టం.. అని బీజేపీ నాయకురాలు తుల ఉమ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అక్కాచెల్లెళ్లు అందరం ఆయన వెన్నంటే ఉంటామని ఉమ అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఉమ రాఖీ కట్టారు. ప్రజలందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు రేవంత్, ఆయన సతీమణి స్వీట్లు తినిపించారు. ‘‘ప్రతి ఆడబిడ్డ.. ఆత్మవిశ్వాసంతో.. ఆర్థిక స్వావలంబనతో.. అన్ని రంగాలలో ఎదగాలని.. మనసారా కోరుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన సోదరుడిగా భావించే రేవంత్‌పై ఎమ్మెల్యే సీతక్కకు ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన పాదయాత్ర సందర్భంగా సీతక్క చెప్పులు కూడా కొనిచ్చారు.
శ్రీశైలం డ్యామ్ లో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. ముంబయికి చెందిన 12 మంది నిపుణులు సర్వే చేస్తున్నారు. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో ప్రాజెక్టు నీటి నిల్వ 308.62 టీఎంసీలుగా ఉంది. 2009 వరదల సమయంలో 215.807 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. కేంద్ర నిధులతో హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టారు. గత పదేళ్లలో డ్యామ్ లో ఏ మేరకు పూడిక చేరిందో ఈ సర్వే ద్వారా నిపుణులు నిర్థరించనున్నారు. 15 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఆ తర్వాత కర్నూలు పరిసర ప్రాంతాల్లో సర్వే జరుగుతుందని డ్యామ్ అధికారులు తెలిపారు
భారత్‌లో రోజు వారీ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,948 మంది వైరస్ సోకింది. మరో 403 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 38,487 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398 గా ఉంది.
ఈ రక్షా బంధన్ పండుగ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు తన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.
‘‘తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. ప్రజల మీద విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది.’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ స్వప్న సాక్షాత్కారం, తెలంగాణకు అమృత జలాభిషేకం. సాకారమైన మల్లన్న సాగరం. అనుమానాలు అపశకునాలు అవరోధాలు తలవంచి తప్పుకున్నయి. కుట్రలు కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుక పొయినయి. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది.’’ అని మరో ట్వీట్ చేశారు.
రాఖీ పూర్ణిమ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక-శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ పాపని-వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకా-తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణీ-సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల, సోదరుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అత్త వారి ఇంట్లో వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. విజయవాడ ప్రసాదంపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం కోవిడ్ తో భర్త మరణించాడు. అప్పటి నుంచి అత్త వారింట్లో ఉంటున్న ఆమెను భర్త కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పటమట పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు ప్రజలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల బాంధవ్యాలను చాటే వేడుకే రక్షాబంధన్ అని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోగలిగిన రోజే నిజమైన రక్షాబంధన్ అని పవన్ అననారు. ఆడపిల్లలపై దురాగతాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన రావాలన్నారు. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలని పవన్ చెప్పారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌కు 32,231 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఔట్ ఫ్లో 42,210 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 179.89 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.
‘‘మహిళలు సాధికారత సాధించేందుకు మన సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, విద్య, ఉద్యోగాలపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు కలిశారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే విడదల రజిని సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ చనిపోవడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Background
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రక్షా బంధన్ అనేది అన్నాచెల్లె్ళ్లు లేదా అక్కా తమ్ముళ్ల బంధానికి చిహ్నమని, ఇది ఒక గొప్ప భారతీయ సాంప్రదాయమని కొనియాడారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -