CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అందరు విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం (Chief Minister’s Breakfast Scheme) ప్రకటించారు.


రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ సర్కార్ విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 1 నుంచి 10వ తరగతుల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి పోషకారంగా ఉదయం అల్పాహారం లభించనుంది.  సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను శుక్రవారం రాత్రి జారీ చేసింది.
 
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లభించడంతో వారు ఆకలి బాధ, సమస్యలు లేకుండా చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది సర్కార్. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఈ అల్పాహార పథకాన్ని ప్రకటించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది.


తమిళనాడుకు వెళ్లిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల టీమ్..
తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని (విద్యార్థులకు అల్పాహార పథకం) పరిశీలించి రావాలని సీఎం కేసీఆర్ ఐఎఎస్ అధికారుల బృందాన్ని ఇటీవల అక్కడికి పంపించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన ఐఏఎస్ అధికారుల బృందం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 
విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్,  ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు (6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు) కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.