BR Ambedkar Death Anniversary: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి నేడు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు.. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, కుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం బీఆర్ అంబేద్కర్ అని తెలంగాణ పీసీసీ కొనియాడింది. ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, ఆర్థిక సంస్కరణలు దళితులు, భారతదేశ చరిత్ర లాంటి విశేషమైన రచనలు మనకు అందించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత వర్ధంతిని నేడు మహాపరినిర్వాణ్ దివాస్‌గా నిర్వహించుకుంటున్నాం. 


చదువుకోవడానికి వెళ్లి వివక్షకు గురయ్యారు. మంచి నీళ్లు తాగేందుకు ఎన్నో ఆంక్షలు ఎదుర్కొన్న వ్యక్తి బీఆర్ అంబేద్కర్. ఎన్నో రచనలు చేసి వాటి ద్వారా సమాజంలో మార్పు కోసం విశేషంగా పోరాడారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు. ఎన్నో అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. 







కుల వ్యవస్థను రద్దు చేసేందుకుగానూ అంబేద్కర్ కుల నిర్మూలనను ప్రతిపాదించారు. దేశంలో కులం ఓ పెట్టుబడిగా, అదనపు విలువగా, చివరకు అధికార కేంద్రంగా ఉందని అంబేద్కర్ అనాడో స్పష్టంగా చెప్పారు. దేశంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ పురోగతిని కొలుస్తాను. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి, బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలన్న అంబేద్కర్ మాటల్లోని సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.






‘సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని బతకాలని అంబేద్కర్ చెప్పారు. ఆయన చెప్పిన మాటలే ఆదర్శంగా వెనకబాటుతనంలో ఉన్న తెలంగాణ సమాజాన్ని తలెత్తుకునేలా చేసేందుకే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కును ఉపయోగించుకుని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ అంబేద్కర్ అప్పుడెప్పుడో చెప్పిన కులం అనే అంశం అధికార కేంద్రంగా మారుతున్న మాట నేటికీ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం రూపంలో అక్షర సత్యంగా కనిపిస్తోంది.






తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు రోడ్డుపాలు అవుతుంటే ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిన సమయంలో ఉద్యమంలోకి జుర్రి, నేడు భోగాలు అనుభవిస్తున్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగానే నయా ఫాసిస్టులు రాజ్యమేలుతున్నారు. ఇలాంటి నయా ఫాసిస్టులను తరిమికొట్టాలని అంబేదర్కర్ వర్ధంతి నాడు ప్రతిజ్ఞ చేద్దామంటూ’ మధుగౌడ్ యాష్కీ పిలుపునిచ్చారు.






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి