TS BJP Chief Kishan Reddy :  తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తసుకున్నారు.


కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత.  1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రస్థానంప్రారంభించారు.  1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఆ పార్టీలో పని చేస్తున్నారు.  1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు.   1985లో  ఉమ్మడి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు అయ్యారు.  యువమోర్చాలో అనేక పదవులు నిర్వహించారు.  2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను నిర్వహించారు.  2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా  బాధ్యతలు చేపట్టారు.  


కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు.  2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  2014 ఎన్నికలలో మూడో సారిగెలిచారు.  2014 లో మరల తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు.  కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైనా  2019 లో జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి  క్యాబినెట్ మంత్రి అయ్యారు.  


తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలతో  బండి సంజయ్ ను మార్చాలని హైకమాండ్ అనుకున్నప్పటికీ ఈటల రాజేందర్ సహా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈటల రాజేందర్ ఇటీవలే పార్టీలో చేరారు. ఆయనకు పదవి ఇస్తే..సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న వారు అసంతృప్తికి గురవుతారన్న ఉద్దేశంతో .. సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లడంలో కిషన్ రెడ్డి చొరవ చూపిస్తారని  భావిస్తున్నారు. అయితే బీజేపీలో జోడు పదవుల సంప్రదాయం లేదు. కేంద్ర మంత్రిగా ఉంటే..  రాష్ట్ర బీజేపీ పదవికి న్యాయం చేయలేరన్న ఉద్దేశంతో పార్టీ పదవి లేదా కేంద్రమంత్రి పదవి ఏదో ఒకటి కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతారాలేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. తొలగింపునకు గురైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. 


ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించారు. ఈ నియామకాలతో తెలంగాణ బీజేపీ మొత్తం ఏకతాటిపైకి  వస్తుందని హైకమాండ్ ఆశిస్తోంది.