బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. అందుకే టీఆర్ఎస్‌లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చిన 12 మంది పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారన్నారు. త్వరలోనే మునుగోడు తరహాలో తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. తమ తమ నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు 12 మంది రాజీనామా చేయబోతున్నారని పేర్కొన్నారు.


చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు బండి సంజయ్. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతోందని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి టీఆర్ఎస్ పై పోరాడుతున్నారని... అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.


బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు బండి సంజయ్. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ తెర లేపారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుంచి 53 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇటీవల జరిగిన సర్వేలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత పెరగబోతోందని... బీజేపీకి సీట్లు, ఓట్ల శాతం మరింతగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.


ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ 3వ రోజు భువనగిరి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో సహప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఫాంహౌజ్ వద్దకు వచ్చి జర్నలిస్టులతో కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు అంశాలపై స్పందించారు. అందులోని ముఖ్యాంశాలు. 



  • ఆయుష్మాన్ భారత్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజల డేటాను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యశ్రీ అంటేనే రోగులను బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన జర్నలిస్ట్‌ పాలసీ  తీసుకొస్తామని వెల్లడించారు  

  • డ్రగ్స్ స్కామ్‌లో ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావిడి చేసి తర్వాత ఎలా నీరుగార్చిందో తెలుసన్నారు. చీకోటి క్యాసినో వ్యవహారం కూడా అంతేనని.. ఇందులో ఎందరో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అన్నారు. చీకోటి ప్రవీణ్ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. 

  • కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని... మునుగోడు ఉపఎన్నికతో కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరుకుంటుందంటూ కామెంట్‌ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది బీజేపీనే అని పునరుద్ఘాటించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించేది కాబోతోందున్నారు. మునుగోడు అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.  

  • తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందని బండి సంజయ్ చెప్పారు. అందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణం కాబోతున్నారన్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటా అని ఆలోచించుకుంటున్నారని వివరించారు. టీఆర్ఎస్ ఏక్ నిరంజన్ పార్టీ అని రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, పలు మాఫియాలు, కబ్జాలు... ఇలా ఏం జరిగినా అందులో టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయం చాలా మందిలో ఉందన్నారు. 

  • కాళేశ్వరం మునగడానికి ప్రధాన కారకుడు కేసీఆరే అని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ శంకర్ దాదా ఎంబీబీస్ లాంటి ఇంజినీరింగ్‌తోనే ఇలా అయిందంటూ ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో భూములు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ దెబ్బకే... చేనేత బీమా ప్రకటన చేశారన్నారు. 

  • బీజేపీలో అంతర్గత విబేధాల్లేవని, అందరం కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు బండి. ప్రజల కోసం, పార్టీ కోసం పని చేసే వాళ్ళకు మాత్రమే బీజేపీలో స్థానం ఉంటుందన్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం పని చేసే వ్యక్తులకు స్థానం ఉండదన్నారు. 

  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ నెల 6న దిల్లీ వెళుతున్నందున ఆ ఒక్కరోజు పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత యథావిధిగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్నికలు వచ్చే వరకు పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

  • ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ ఇమ్మంటే.. ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ ఆ వివరాలు ఇవ్వలేదని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.7 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేసి దాదాపు 4 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులకు లెక్కలు చూపలేదని ఆరోపించారు. ఆ నిధులను దారి మళ్లించిందంటూ కామెంట్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.