Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించుకోని అంశంపై ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం కోసం.. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే, తాము మాత్రం రాజీనామా చేసి బీజేపీలో చేరాలని షరతు పెట్టినట్లుగా రఘునందన్ రావు వెల్లడించారు. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉంటేనే బీజేపీలోకి ఎంట్రీ అని తమతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పామని అన్నారు. శుక్రవారం (జూలై 12) బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. 


మరోవైపు, కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను అరెస్టు చేయడానికి కూడా ముందూ వెనక ఆలోచిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే.. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ ల పేరుతో వివిధ ట్యాక్సులు వేస్తున్నారని అన్నారు. 


తెలంగాణలో నిరుద్యోగులపై ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారంలో వచ్చాక మరోమాట కాంగ్రెస్ చెబుతోందని రఘునందన్ విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రూ.4,116 నిధులు లేవు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా రూ.4 లక్షలు జీతం తీసుకుంటున్నాడని చెప్పారు. దేశంలో ఎక్కువ నెల జీతం తీసుకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డే అని అన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని చెప్పారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 


ఎన్నికల హామీ మేరకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించామని అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని నిర్ణయించామని చెప్పారు. ధరణి పరిస్థితి ఏంటని.. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారని అన్నారు. కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవుల భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజుల పాటు వెళ్తున్నారని విమర్శించారు.