AP Nature Farming Got International Award: ఏపీ సేద్యానికి అంతర్జాతీయ వేదికగా అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక 'గుల్బెంకియన్ అవార్డు' వరించింది. ఓ సైంటిస్ట్, మరో సంస్థతో కలిసి ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డును దక్కించుకుంది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి.విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీ పడి ఏపీసీఎన్ఎఫ్ (APCNF) ఈ అవార్డు దక్కించుకుంది. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో పాటు ఏపీసీఎన్ఎఫ్‌ను ఈ ఘనత వరించింది. ఈ పురస్కారం కింద వచ్చే ఒక మిలియన్ యూరోల నగదు బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు.






ఇదీ చరిత్ర


ఏపీ ప్రభుత్వం ఏపీసీఎన్ఎఫ్ (APCNF) ప్రోగ్రాంను 2016లో ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ పద్ధతుల్లో సేద్యం చేసేలా రైతు సాధికార సంస్థ తీవ్ర కృషి చేస్తోంది. పంటల వైవిద్యీకరణ, సేంద్రియంగా తయారు చేసిన ఎరువుల వాడకం, దేశీయ విత్తనాల తిరిగి ప్రవేశపెట్టడం, నేల సారాన్ని కాపాడుకుంటూ పంట సాగు చేయడం వంటి అంశాలను ఇది ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, మహిళా రైతులతో కలిసి దాదాపు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తోంది. 


కాగా, 2020లో గుల్బెంకియన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మానవాళికి ముప్పుగా పరిణమిస్తోన్న పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ అవార్డులు అందిస్తారు. ఈ ఏడాదికి ఏపీ సేద్యానికి పురస్కారం వరించింది.


Also Read: Free Bus Service: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆ రోజు నుంచే!