Students Suicide: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే తన గుండె తరుక్కు పోతోందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఫలితాలు చూసి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని... నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పిదం కారణంగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరనం చెందుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉన్నారు. తమ చావుకు కారణం తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ అని, వీళ్లు బాధ్యత వహించాలంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.
‘గతంలో మంత్రి కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?. విద్యార్థుల వద్ద నుంచీ ఒక్క ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయించాలి. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుంది... అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోం. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని’ఓ ప్రకటనలో ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది పాస్ అయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ సంవత్సరం 11 శాతం తగ్గింది. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి