MP Arvind on BRS: నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ మాయ అని... 2021లో 10 వేల కోట్లు కేటాయించారని అన్నారు. ఇప్పటి వరకు దాని ఆడిటింగ్ ఊసే లేదంటూ కామెంట్లు చేశారు. రూ. 10875 కోట్లు డబుల్ బెడ్ రూమ్ కి కేటాయించి.. ఆ తర్వాత దాన్ని 4 వేల కోట్లకు కుదించారని చెప్పారు. ఆ డబ్బుల లెక్కలు ఇంత వరకు లేవంటూ ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ అని దాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసేవి కంత్రి పనులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు పడక గదుల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 


తెలంగాణలో లక్షా 70 వేల ఇళ్లలో కేవలం 20 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ఎంపీ అర్వింద్ అన్నారు. జగిత్యాలలో 40 శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ముస్లింలకు ఇచ్చారని..  వారికి ఏ లెక్కన ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. హౌసింగ్ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి జిల్లాకు చెందిన వాడే కావటం సిగ్గు చేటన్నారు. బీజేపీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని.. తన ఫౌండేషన్ ద్వారా వివిధ రూపాల్లో తన కార్యకర్తల కోసం రూ. 29 లక్షలు సాయం చేశామన్నారు. బీజేపీ డబ్బులిచ్చి ఓట్లు అడగదని.. బీజేపీ కార్యకర్తల కోసం ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు సాయం చేస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తేనే డబ్బులు పంచే సంస్కృతికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం అని ఎంపీ అర్వింద్ తెలిపారు. సీఎంఆర్ చెక్కుల కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడం దేనికని అన్నారు. ఓ గ్రామంలో మంత్రి ప్రజలతో మాట్లాడుతూ.. సీఎంఆర్ చెక్కుల కోసం కాళ్లు మొక్కానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ లను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. 


ఇండస్ట్రియల్ జోన్ లో రైతుల భూములు పోతున్నాయని... అసలు రాష్ట్రంలో ఒక్క ఫ్యాక్టరీ గాని ఒక్క ఇండస్ట్రీ గాని తీసుకొచ్చారా అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారని అన్నారు.ఒక్క ఇతనాల్ ఫ్యాక్టరీ తేలేదని చెప్పారు. సీఎం కాళ్లు మొక్కి షుగర్ ఫ్యాక్టరీ, ఇతనాయిల్ ఫ్యాక్టరీ తీసుకురా అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ ల పేరుతో టీఆరెస్ నాయకులు.. ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎస్ పథకం లేదని, ఫ్రీ ఎరువులు లేవని, ఆరోగ్య శ్రీ లేదని అన్నారు. చివరకు ఆరోగ్య బీమా కూడా లేదన్నారు. తెలంగాణలోనే దిక్కు లేదని, దేశంలో బీఆర్ఎస్ దూసుకుపోతోందని అంటున్నారని ఎంపీ అర్వింద్ ఎద్దేవ చేశారు. పేదలకు అవసరమయ్యే కొత్త పథకాల దిక్కు లేదని... ఫసల్ బీమా పథకం ఇప్పటి వరకు ప్రవేశ పెట్టలేదని చెప్పారు. వర్షాలకు పసుపు పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్నారని.. అయినా ఫెసల్ బీమా పథకం ఊసే లేదన్నారు. తక్షణమే ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకోసం సీఎం కేసీఆర్ కాళ్లు.. ప్రశాంత్ రెడ్డి ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు డెకాయిట్ లు గా మారారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.