తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కాంగ్రెస్ లోకి రావాలని గతంలో పార్టీ విడిచి వెళ్లిన వారిని, ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. పార్టీ విడిచి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఎవరూ బీజేపీని వదలబోరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపిన రోజున తనకు బీజేపీనే తగిన గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలే బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ను ఓడించగలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.
కాంగ్రెస్ నుంచి లేదా ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన వారు అందరూ ఆలోచనతోనే బీజేపీలో చేరారని చెప్పారు. ఈటల రాజేందర్ క్యారెక్టర్ అనేది తెరిచిన పుస్తకం అని, రేవంత్ రెడ్డి చిల్లర మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలందరూ సమష్ఠిగా పని చేస్తున్నట్లు చెప్పారు. పదే పదే పార్టీలు మారడం తన విధానం కాదని అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నియంతృత్వ కేసీఆర్ సర్కారును అంతం చేయడమే తన లక్ష్యమని అన్నారు.
కర్ణాటక ఊపుతో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి యత్నాలు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రారంభం కావడంతో నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీని వీడిపోయిన వాళ్లందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావాలన్నారు. ఈటల రాజేందర్ కూడా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు.
నా వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటే ఓ మెట్టు దిగుతా - రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారని ..అయితే రేవంత్ రెడ్డి సారీ చెబితే చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి తాను ఓ మెట్టు దిగడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఖండించారు.