Vijayashanthi: తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. గతంలో ఈటల వర్సెస్ బండి సంజయ్ వ్యవహారం నడిచిందనేది బహిరంగ రహస్యం. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో వివాదం సద్దుమణిగింది. అంతలోపే విజయశాంతి, ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయశాంతి ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి.


కావాలనే దుష్ప్రచారం
సొంత పార్టీ నేతలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి రాములమ్మ దూరమన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు లేదని, పరోక్షంగా ఈటలకు రాజేందర్‌కు కౌంటర్ ఇచ్చారు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న ముఖ్యనేతల సమావేశంలో తాను స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలకు చెప్పిన అంశాలను లీకేజ్‌ల పేరుతో బయటకు చెప్పడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు. బీజేపీలోని కొంతమంది నేతలు పనిగట్టుకుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీకి రాములమ్మ దూరమంటూ తనపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు విజయశాంతి తెలిపారు. 






కోవర్టులు మీరే.. కాదు మీరే 
సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో కామెంట్స్ చేశారు. వాటిపై రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని సమాచారం. బండి సంజయ్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుందని, ఆ ప్రతిపాదనకు రాములమ్మ అడ్డు పడ్డారని గుసగుసలు వచ్చాయి. అప్పటినుంచి ఈటల రాజేందర్ వర్సెస్ విజయశాంతి మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది.


బీజేపీలో బీఆర్‌ఎస్ కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కోవర్టులతో పార్టీకి నష్టమేనని, నిజంగా కోవర్టులు ఉంటే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని విజయశాంతి అన్నారు. కోవర్టుల గురించి చెప్పి పార్టీకి మేలు చేసినవారు అవుతారని ఈటల రాజేందర్‌కు సూచించారు. ఊరికో కోవర్టులు అని చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. దొంగతనం జరిగితే ఆ దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత ఉండదా అని అడిగారు. వారిని పోలీసులకు ఎలా అప్పగిస్తామో.. కోవర్టుల గురించి హైకమాండ్‌కు తెలియజేయాలని కోరారు. 


దీనిపై అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.  బీజేపీలో కోవర్టులు ఉండరని తేల్చి చెప్పారు. సిద్దాంతం కలిగిన పార్టీలో కోవర్టులకు ఆస్కారం లేదన్నారు. ఈటల, రాములమ్మ మధ్య జరుగుతున్న  మాటల యుద్దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. గతంలో ఈటల, విజయశాంతి బీఆర్ఎస్(గతంలో టీఆర్ఎస్) పార్టీలో కలిసి పనిచేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఈటల రాజేందర్ మాత్రం ఉద్యమం సమయం నుంచి బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. తరువాత ఇద్దరూ బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా.